పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా 63,656 చదరపు కిలోమీటర్ల మేర కొత్త వాల్‌ను రూ.990 కోట్లతో నిర్మించే బాధ్యతను మేఘా ఇంజనీరింగ్‌కు అప్పగింతకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. జలవనరుల శాఖ జారీ చేసిన మెమోకు ఆమోదం తెలిపింది. అయితే.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో అనుభవం కలిగిన జర్మన్ సంస్థ ‘బావర్’తో ఈ పనులు చేయించాల్సిందేనని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) షరతు పెట్టాయి. దీంతో వాల్ నిర్మాణాన్ని సబ్‌కాంట్రాక్టు కింద బావర్‌కే మేఘా ఇవ్వనుంది. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. కేంద్ర జల సంఘం నిర్ణయం మేరకు కొత్తగా టెండర్లు పిలవకుండా ప్రస్తుతం డయాఫ్రం వాల్ మరమ్మతు పనులు చేస్తున్న మేఘాకే ‘స్టాండర్డ్ ఆఫ్ రేట్స్ (ఎస్‌వోఆర్ )’ మేరకు పనులు అప్పగించడం వల్ల ఒక సీజన్ నష్టపోకుండా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే వీలుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నెల ఏడో తేదీన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జారీ చేసిన మెమోను యథాతథంగా ఆమోదించింది. కొత్త వాల్ నిర్మాణానికి సంబంధించి రెండు అంశాలను రాష్ట్రప్రభుత్వం కేంద్రం ముందుంచింది. ఒకటి.. కొత్తగా టెండర్లు పిలవడం; రెండోది.. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థనే కొనసాగించడం. రెండో దానికే కేంద్రం మొగ్గు చూపింది. కొత్త వాల్ నిర్మాణ పనులు మేఘాకు అప్పగిస్తూనే.. 100 మీటర్ల లోతులో ప్లాస్టిక్ డయాఫ్రం వాల్ నిర్మాణంలో అనుభవం కలిగి.. రాతి నేల తగిలేంత వరకూ లోతుల్లోకి వెళ్లి గోడకట్టే బావర్ సంస్థ సహకారం తీసుకోవడం మంచిదని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. కొత్త వాల్‌ను 1.5 మీటర్ల వెడల్పున నిర్మించాలని జలసంఘం స్పష్టం చేసింది. డయాఫ్రం వాల్ తప్ప మిగతా పనులన్నీ మేఘాయే చేస్తుంది.