తిరుపతి లడ్డూ వివాదంపై టీటీడీ స్పందించింది. వివాదం గురించి విలేకర్ల సమావేశం నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు కీలక విషయాలు వెల్లడించారు. తిరుమల లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఈవో తెలిపారు. లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితోనూ మాట్లాడినట్లు చెప్పారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈవో శ్యామలరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి కూడా నాణ్యంగా ఉండాలని సూచించారని తెలిపారు. అయితే గతంలో నెయ్యిని కిలో రూ.320లకే సరఫరా చేశారన్న శ్యామలరావు.. అంత తక్కువ ధరకు కొనుగోలు చేశారంటనే నెయ్యి నాణ్యతను అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇక తాము బాధ్యతలు స్వీకరించగానే జులై ఆరో తేదీన పరీక్షల కోసం నెయ్యిని ల్యాబ్‌కి పంపామన్నారు. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యిలో నాణ్యత లేని విషయం బయటపడినట్లు చెప్పారు. నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని నివేదికలు తేల్చాయన్న ఈవో శ్యామలరావు.. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత.. కేవలం 20 పాయింట్లే ఉందని వివరించారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లేదని ల్యాబ్ టెస్టుల్లో తేలిందని చెప్పారు. లడ్డూ తయారీ కోసం ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన పంది కొవ్వు, బీఫ్ కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై 6, 12వ తేదీల్లో వచ్చిన రెండు ట్యాంకుల్లోని నెయ్యిని పరీక్షకు పంపితే .. ల్యాబ్ టెస్టుల్లో ఇది తేలిందని టీటీడీ ఈవో వెల్లడించారు.
అంత తక్కువ ధరకు నెయ్యి రాదని అందరూ చెప్తూ ఉండటంతోనే నెయ్యిని పరీక్షలకు పంపామని ఈవో తెలిపారు. అయితే టీటీడీ వద్ద సొంత ల్యా్బ్ లేకపోవటంతో .. బయట ల్యాబ్‌లకు నెయ్యిని పరీక్షకు పంపించామన్న ఈవో.. ఈ ల్యాబ్ టెస్టుల్లోనే ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు కనిపించినట్లు తేలిందన్నారు. ఇక లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే.. చర్యలు తీసుకున్నామని టీటీడీ ఈవో తెలిపారు. దీనిపై కమిటీ వేసి చర్యలు ప్రారంభించామన్నారు. మరోవైపు లడ్డూ తయారీకి పంపించిన నెయ్యిని పరీక్షించడం ఇదే తొలిసారని ఈవో శ్యామలరావు వ్యాఖ్యానించారు.