తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. నెయ్యి నాణ్యత పరీక్ష విధానాలను ఎవరూ మార్చలేదన్న వైఎస్ జగన్.. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియనే తాము కొనసాగించినట్లు చెప్పారు. తిరుమలకు నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకు ఓసారి టెండర్లు పిలుస్తారన్న వైఎస్ జగన్.. టెండర్ల ప్రక్రియ తర్వాత ఎల్1 కాంట్రాక్టర్‌కు నెయ్యి సరఫరాను కేటాయిస్తారని చెప్పారు.
తిరుమలలో నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షలను ఎవరూ మార్చలేదన్న వైఎస్ జగన్.. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ NABL సర్టిఫికేట్ తేవాలన్నారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి శాంపిళ్లను తీసుకుని మూడుసార్లు పరీక్షిస్తారని చెప్పారు. మూడు టెస్టుల్లోనూ పాసైతేనే.. ఆ ట్యాంకర్‌ను టీటీడీ అనుమతిస్తుందని గుర్తుచేశారు. చంద్రబాబు చేస్తున్న తిరుపతి లడ్డూలో జంతువుల అవశేషాలు అనేది ఓ కట్టుకథగా వైఎస్ అభివర్ణించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవటం న్యాయమేనా అని ప్రశ్నించారు. జులై 12న ట్యాంకర్లలోని నెయ్యి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకున్నారన్న వైఎస్ జగన్.. జులై 17న పరీక్షల కోసం ఎన్డీడీబీ కి పంపారన్నారు. ఎన్‌డీడీబీ నుంచి జులై 23న రిపోర్టు వచ్చిందన్న వైఎస్ జగన్.. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నారని గుర్తు చేశారు. అయితే రెండు నెలల కిందటే నివేదిక వస్తే ఇన్ని రోజులు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు.
టీడీపీ కూటమి వందరోజుల పాలన గురించి, సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే కారణంతోనే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. తిరుమల లడ్డూ గురించి, శ్రీవారి ఆలయం గురించి ఒక సీఎం అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఓ స్వతంత్ర సంస్థగా పేర్కొన్న వైఎస్ జగన్.. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు