ముంబయి నటి కాదంబరి జెత్వానీ వ్యవహారం ముగ్గురు ఐపీఎస్ అధికారుల మెడకు చుట్టుకోవడం తెలిసిందే. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాంతి రాణా టాటా పిటిషన్ పై హైకోర్టు సోమవారం నాడు (సెప్టెంబరు 23) విచారణ చేపట్టనుంది. కాగా, నటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు, నిర్బంధం, వేధింపుల అంశాల్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆరోపణాలు రాగా, డీజీపీ నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు సమర్పించారు. సీఎం ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఐపీఎస్ అధికారుల పేర్లను ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఇంకా చేర్చలేదని సమాచారం. అధికారికంగా వారిపై కేసు ఇంకా నమోదు కాలేదు. అయినప్పటికీ, ఆ ఐపీఎస్ లు అప్రమత్తమయ్యారు. కాంతి రాణా టాటా నేడు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడమే అందుకు నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో కాంతి రాణా టాటా విజయవాడ సీపీగా ఉన్నప్పుడే ఈ వేధింపుల వ్యవహారం చోటుచేసుకుంది.