తిరుమల లడ్డూ వివాదం ఏపీలో రాజకీయంగా కాక రేపుతోంది. ఈ అంశంపై ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఇందులోకి బీజేపీ కూడా ఎంటరైంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవటంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. హిందువులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలంటూ బీజేవైఎం కార్యకర్తలు మెరుపు ఆందోళన నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద గుంటూరు జిల్లాకు చెందిన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఒక్కసారిగా వైఎస్ జగన్ ఇంటి ముట్టడికి బీజేవైఎం శ్రేణులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఇక వైఎస్ జగన్ ఇంటివద్దకు చేరుకున్న బీజేవైఎం నేతలు గోవింద నామస్మరణ చేస్తూ ఆందోళన చేపట్టారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో కారకులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్ జగన్ నివాసం ముందున్న గేటును తోసుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేయటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇదే సమయంలో కొంతమంది రాళ్లు విసరటంతో సెక్యూరిటీ కార్యాలయం కిటికీ అద్దాలు కూడా పగిలిపోయినట్లు తెలిసింది. అయితే పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని వారిని నిలవరించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
మరోవైపు తిరుపతిలోనూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారిని శిక్షించాలంటూ తిరుపతిలోని వకుళామాత ఆలయం సమీపంలో ధర్నా చేపట్టారు. అనంతరం స్వామికి టెంకాయలు కొట్టి.. దుర్మార్గులను శిక్షించాలని కోరారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారు భక్త కోటికి క్షమాపణ చేప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీ ఆరోపణలకు కౌంటర్ ఇస్తోంది. ఎన్డీఏ కూటమి వంద రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా వివాదం తెరపైకి తెచ్చారంటూ మండిపడుతున్నాయి. నిజానిజాల కోసం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది.