పల్నాడు జిల్లాలో గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులు గోడ దూకి పారిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు గోడ దూకి వెళ్లిపోయారు. ఈ స్కూలులో మొత్తం 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడ చదువు చెప్తున్నారు. అయితే పదో తరగతికి చెందిన 67 మంది విద్యార్థులు సోమవారం ఉదయం ప్రేయర్ ముగియగానే గోడ దూకి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే గుర్తించిన ఉపాధ్యాయులు కొంత మందిని అక్కడే పట్టుకున్నారు. అయితే 35 మంది వరకూ విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ విద్యార్థులంతా హాస్టల్‌కు సమీపంలో ఉండే కొండవీడు కొండలపైకి వెళ్లిపోయారు. అయితే ఈ లోపే పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. విద్యార్థులు ఎటువైపు వెళ్లారనే దానిపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులను వెంటబెట్టుకుని కొండవీడు కొండల వద్దకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థులకు నచ్చజెప్పి వెనక్కి తీసుకువచ్చారు. ఆ తర్వాత స్థానిక డీఎస్పీ అక్కడకు చేరుకుని హాస్టల్ నుంచి గోడ దూకి వెళ్లిపోవడానికి కారణాలపై ఆరా తీశారు. అయితే టీచర్లు తమను వేధిస్తున్నారని ఈ సందర్భంగా పోలీసులతో విద్యార్థులు చెప్పారు. హాస్టల్‌లో సౌకర్యాలు సరిగా లేవని.. ఆహారం కూడా మంచిగా లేదంటూ ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఆటలు ఆడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు డీఎస్సీ వద్ద వాపోయారు. బాత్రూమ్‌లు క్లీన్ చేయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రోజూ స్లిప్ టెస్టులు పెడుతున్నారని.. ఒకేసారి అన్ని పరీక్షలూ రాయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. దీంతో హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులతో మాట్లాడిన పోలీసులు.. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. అలాగే ఇలా పారిపోయే ప్రయత్నాలు చేసి ఇంట్లో వాళ్లను, ఉపాధ్యాయులను ఆందోళన పెట్టొద్దని విద్యార్థులకు పోలీసులు సూచించారు. క్రమశిక్షణతో ఉండాలని.. ఏమైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు.