ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తాజాగా ఏ2గా అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, ఏ3గా నాటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా, ఏ6గా నాటి విజయవాడ డీసీపీ విశాల్‌గున్నీ పేర్లను చేర్చారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు ఏ4గా ఏసీపీ హనుమంతరావు, ఏ5గా అప్పటి దర్యాప్తు అధికారి ఎం.సత్యనారాయణ, ఏ7గా న్యాయవాది, ఏ8గా నకిలీ డాక్యుమెంట్‌ను రాసిన రైటర్ పేర్లను పెట్టారు. ఈ ఎఫ్‌ఐఆర్ కాపీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు అందజేశారు. ఈ కేసులో ఇదివరకే ఏ1గా చేర్చిన విద్యాసాగర్‌ను న్యాయాధికారి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి హాజరుపరిచారు. జెత్వానీ కేసు వెలుగు చూశాక పరారైన విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం న్యాయాధికారి ముందు హాజరు పరిచారు. విద్యాసాగర్‌కు వచ్చే నెల నాలుగో తేదీ వరకు రిమాండ్ విధించారు. అతడిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. విద్యాసాగర్‌ను మరింతగా విచారించేందుకు ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జెత్వానీ ఫిర్యాదు చేశాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఢిల్లీలో నివాసం ఉన్నాడు. ఉత్తరాది మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కేసు విషయం తెలియడంతో సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని కారులో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రాకపోకలు సాగించాడు. బళ్లారిలో ఉన్న తన బంధువుతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు పోలీసులు సాంకేతికంగా గుర్తించారు. డెహ్రాడూన్‌లో ట్రీ ఆఫ్ లైఫ్ రీసార్ట్‌లో బస చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇక్కడి నుంచి ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి నిఘా పెట్టింది. కారులో రిసార్ట్‌లోకి వెళ్తుండగా విద్యాసాగర్‌ను పట్టుకున్నారు.