మైనార్టీ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను పునర్‌వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ.లక్ష సాయం, ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10వేలు, రూ.5వేలు ఇస్తామన్న హామీలను త్వరలోని అమల్లోకి తేవాలని సూచించారు. మసీదుల నిర్వహణకు రూ.5 వేలు ఇచ్చే కార్యక్రమానికి కూడా త్వరలో శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, ఇటీవలి ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని సూచించారు. అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు చేపట్టిన షాదీ ఖానాలు, ఇతర నిర్మాణాలను పూర్తిచేయాలని చెప్పారు. ప్రారంభం కాని పనులను రద్దుచేసి వాటిని పునఃసమీక్షించాలని ఆదేశించారు. కడపలో హజ్ హౌస్ కోసం నాడు టీడీపీ ప్రభుత్వం రూ.24కోట్లు మంజూరు చేసిందని, ఆ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయని అధికారులు తెలుపగా.. మిగతా పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. అలాగే.. గుంటూరు క్రిస్టియన్ భవన్‌కు గత టీడీపీ ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేయగా 50 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. ఆ మిగిలిన పనులు కూడా వెంటనే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. విశాఖపట్నం, గుంటూరు, నంద్యాలల్లో రూ.35 కోట్లు చొప్పున మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సైన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వేను రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వక్ఫ్ బోర్డు భూముల అభివృద్ధి పరిచేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు. వక్ఫ్ బోర్డుకు ఆదాయం తేవడంతో పాటు భూముల అభివృద్ధి ఫలాలు కూడా ఆ వర్గానికే అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, అధికారులు పాల్గొన్నారు.