విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ.3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచామన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికీ పింఛన్ అందకుండా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు వివరించారు. అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పింఛన్లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గ్రామసభలు పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతోపాటు, అనర్హులను తొలగించాలని.. కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అనర్హులు దివ్యాంగుల పేరుతో పింఛను పొందడం అంటే అర్హులకు అన్యాయం చేయడమేనన్నారు. కాగా, వృద్ధులకు పింఛను ఇవ్వడంతోపాటు వారికి ఇతరత్రా ఏం చెయ్యవచ్చనేది కూడా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. డిజిటల్ లిట్రసీ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పంచాలన్నారు. వృద్ధులకు పింఛన్ ఇచ్చి వదిలేయడం కాకుండా వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చనే విషయంలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. కేంద్రం దాదాపు రూ.200 కోట్లు ఈ సెంటర్‌కు మంజూరు చేసిందని, అయితే వైసీపీ హయాంలో పనులు జరగలేదన్నారు. సింగిల్‌గా ఉండే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. పిల్లలకు వైద్య పరీక్షలు చేసి, వారు భవిష్యత్‌లో దివ్యాంగులు కాకుండా అరికట్టవచ్చన్నారు.