జీవీఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సభ్యులందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది. కౌన్సిల్ సమావేశం కోసం అధికారులు 75 అంశాలతో రెండు ఎజెండాలను తయారుచేసి ఇప్పటికే సభ్యులకు అందజేశారు. సాదారణ ఎన్నికల తర్వాత జీవీఎంసీ కౌన్సిల్‌లో పార్టీల బలాబలాలు మారిపోయాయి. ఎన్నికల ముందు వరకూ కౌన్సిల్‌లో వైసీపీకి మెజారిటీ ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్పొరేటర్లు పలువురు టీడీపీ, జనసేనల్లో చేరారు. ఈ నేపథ్యంలో గత నెలలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈ క్రమంలో మంగళవారం నాటి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ హయాంలో జీవీఎంసీలో జరిగిన అవినీతిపై ప్రశ్నించాలని కూటమి కార్పొరేటర్లు నిర్ణయించారు.
మెకానికల్ విభాగంలో ఎన్ని వాహనాలు ఉన్నాయి?, జోన్‌ల వారీగా ఎన్ని వాహనాలు ఉన్నాయి?, ప్రధాన కార్యాలయంలో ఎన్ని వాహనాలు ఉన్నాయనే వివరాలు అడిగితే అధికారులు ఇంతవరకూ ఇవ్వకపోవడంతో ఆ విభాగం అధికారులను నిలదీయాలని కూటమి కార్పొరేటర్లు భావిస్తున్నారు. అలాగే నగరంలో రోడ్లను శుభ్రపరిచే వాహనాలు ఎన్ని ఉన్నాయి?, వాహనాల రిపేర్లు, నీటి సరఫరా విభాగంలో లీకేజీలు, నిర్వహణకు పిలుస్తున్న టెండర్లు, యూజీడీ నిర్వహణకు పిలిచిన టెండర్లతోపాటు హార్టికల్చర్ విభాగంలో వెలుగులోకి వచ్చిన అవినీతిపై కూడా కౌన్సిల్‌లో చర్చకు పట్టుబట్టాలని ఇటీవల జరిగిన కూటమి కార్పొరేటర్ల షాడో సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా వైసీపీ హయాంలో మధురవాడ ఆరో వార్డులోని ఎస్‌ఆర్‌ఎం లేఅవుట్‌లోని బటర్‌ఫ్లై పార్కు స్థలం బదలాయింపునకు కౌన్సిల్‌లో వైసీపీ ఏకపక్ష తీర్మానం చేయడం, వైసీపీ నేతల ఆస్తులకు రోడ్లు నిర్మాణం, టీడీఆర్‌ల జారీకి సంబంధించిన వివరాలను సంబంధిత విభాగాల అధికారులను కోరాలని కూటమి నేతలు, కార్పొరేటర్లు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు కౌన్సిల్‌లో బలం కోల్పోయిన వైసీపీ కూడా కూటమి దాడిని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన సోమవారం వైసీపీ కార్పొరేటర్ల షాడో సమావేశం జరిగింది. అందరూ ఉమ్మడిగా కూటమి కార్పొరేటర్ల ఎదురుదాడిని, ఆరోపణలను తిప్పికొట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరంలో జరిగిన కొన్ని అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో వారిని డిఫెన్స్‌లో పడేయాలని వైసీపీ కార్పొరేటర్లు భావిస్తున్నట్టు సమాచారం.