తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశారు.. సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామన్నారు. అయితే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.. మరి సిట్ చీఫ్‌గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు పేర్లు ప్రాధానంగా వినిపిస్తున్నట్లు చెబుతున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం, అపచారాలు, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సిట్ చీఫ్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి.. వారిలో సీనియర్ ఐపీఎస్ పీహెచ్‌డీ రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠిలు ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని సిట్ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందంటున్నారు.
వీరిద్దరితో పాటుగా వినీత్ బ్రిజ్‌లాల్, సీహెచ్ శ్రీకాంత్ పేర్లూ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్‌చంద్ర లడ్డాలు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం భేటీ అయ్యారు. ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారిని సిట్ చీఫ్‌గా నియమిస్తామని చంద్రబాబు ప్రకటించగా.. ఆయా అధికారుల ప్రొఫైల్, ఇతర వివరాల్ని డీజీపీ, నిఘా ఇంటిలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రికి సమర్పించారు. అలాగే ఈ సిట్‌లో సభ్యులుగా ఎవరెవర్ని తీసుకోవాలనే అంశంపైనా చర్చించారు.. ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు టీటీడీ ఈవో. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చఅన్నారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ, యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన.. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు.