రాబోయే 18 నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో విశాఖపట్నం దేశంలో 10వ నగరంగా ఉండగా, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో మాత్రం 27వ స్థానంలో ఉందన్నారు. ఈ గ్యాప్‌ను సరిదిద్దాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖపట్నం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో ప్రారంభమైందన్నారు. వ్యక్తిగత విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకునేలా త్వరలో రాష్ట్రంలో పీఎం సూర్య పథకం ప్రారంభం కాబోతుందన్నారు. దీని ద్వారా విప్లవాత్మక మార్పులు రావడంతో పాటు చౌకగా విద్యుత్ లభిస్తుందన్నారు. విశాఖ నగరంలో ఇప్పటికే ప్రారంభమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై మంత్రి లోకేశ్ దృష్టిసారించి, వేగంగా పూర్తిచేసేందుకు సహకరించాలని కోరారు.షీలానగర్-సబ్బవరం రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయని, అనకాపల్లి-భీమిలి రోడ్డు విశాఖపట్నం నగరం గుండా వెళ్ల ట్రాపిక్ సమస్య ఏర్పడుతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి 12 ఫ్లైఓవర్లను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎలివేటెడ్ హైవే రోడ్డు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అధునాతన టెక్నాలజీతో హౌసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గంలో యువనాయకత్వంతో విశాఖనగరం వేగవంతంగా అభివృద్ధి సాధించబోతోందని, ఇందుకు పారిశ్రామికవేత్తలు తమవంతు సహాయ, సహకారాలు అందించాలన్నారు.