రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వాన వేగవంతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.17 వేల కోట్ల వ్యయంతో పిపిపి విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ గేట్ వే పోర్టులు శరవేగంగా నిర్మితమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పైప్‌లైన్‌లో ఉందన్నారు. మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా ఎయిర్ కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు. గ్లోబల్ మార్కెట్‌కు దీటుగా విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామన్నారు.పీపీపీ మోడ్‌లో క్రిటికల్ ఇన్‌ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్టులు చేపడతామన్నారు. చంద్రబాబు మార్గనిర్దేశకత్వంలో ఇన్‌ఫ్రా అభివృద్ధిలో భాగంగా విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రాబోతున్నాయన్నారు.