2047 నాటికి దేశంలో నెం.1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన సదస్సుకు జాతీయస్థాయి ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... రాష్టంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి గత ప్రభుత్వ చర్యల కారణంగా అయిదేళ్లుగా స్పీడ్ బ్రేకర్లు పడ్డాయని, అన్నివిధాలా నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగవంతంగా ముందుకు సాగుతోందన్నారు.