విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తిరుమల లడ్డూ ప్రసాదం ఘటనపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నోవాటెల్‌లో సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జరగనివ్వమని, ఇది అసలు చర్చనే కాదని, కానీ దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదం అపవిత్రమైన విషయంలో సిట్ దర్యాఫ్తులో అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు.విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది పారిశ్రామికవేత్తలు, కావాల్సిన ఫైనాన్షియర్లు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమ్మిట్ ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో విశాఖకు ఏం చేయాలి? మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనే అంశాలపై చర్చించామన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో పాటు భోగాపురానికి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై చర్చించడం జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించిందన్నారు. గతంలోనే అనేక పెట్టుబడులు వచ్చాయని, వైసీపీ ఐదేళ్ల పాలనలో స్పీడ్ బ్రేకర్‌లా అవి ఆగిపోయాయని ఆరోపించారు. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.ఏ విషయంలో అయినా చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాము పరదాలు కట్టుకొని తిరగడం లేదని, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నామన్నారు. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడామని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదన్నారు. వారికి కావాల్సిన రాయితీలు కూడా ఇవ్వలేదన్నారు. మైనింగ్‌ను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.