వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... రవాణా శాఖ మంత్రిగా పని చేసినప్పటికీ... బందరు బస్టాండ్ ను అభివృద్ధి చేయలేదని... ఇప్పుడు లడ్డూ అంశంలో పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పళ్లు రాలిపోతాయని హెచ్చరించారు. మీ అధినేత జగన్ ను కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేదని... అలాంటి వ్యక్తిని వెనకేసుకురావడానికి నీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉంటే స్వామివారికి ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారా? అని నిలదీశారు. మొన్న గుడివాడలో నిన్ను జనాలు కొట్టినా సిగ్గు రాలేదా? అని ఎద్దేవా చేశారు. ఈసారి బందరు ప్రజలు నిన్ను తరిమి కొడతారని చెప్పారు. ఇంకోసారి నోటికొచ్చినట్టు వాగితే... నోరు మూసుకునేలా బుద్ధి చెపుతామని హెచ్చరించారు.