శ్రీ వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి నేతలు, రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ని దుర్మార్గంగా వాడుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే, వారికి డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వంత పాడుతున్నారని మండిపడ్డారు. కూటమి నేతలు స్వామివారి పట్ల చేసిన పాపాల ప్రక్షాళన కోసమే ఈనెల 28న రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల్లో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేయనున్నారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలంతా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.