తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మద్యం మత్తులో వదినను మరిది హత్య చేసిన సంఘటన జరిగింది. అనపర్తి సీఐ శివగణేష్ తెలిపిన వివరాల ప్రకారం డోకుబుర్ర బుజ్జి(40) మరిది అయిన డోకుబుర్ర గంగరాజు గ్రామంలో ఎదురెదురు ఇళ్లలో నివశిస్తున్నారు. మృతురాలి భర్త చనిపోయి నాలుగేళ్లు కాగా,. కుమారుడు, కుమార్తెతో కలసి గంగరాజు ఇంటి ఎదురుగా వుంటున్నారు. ఆమె కుమారుడు శ్రీను పనిలోకి వెళ్లడం లేదంటూ మరిది గంగరాజు అతనిని కొట్టడంతో చొక్కా చిరిగిపోయింది. చిరిగిన చొక్కాతో ఇంటికి వచ్చిన కొడుకును ఏం జరిగిందని అడగ్గా విషయం చెప్పడంతో గంగరాజును ఎందుకు కొట్టావని బుజ్జి నిలదీసింది. దీంతో మద్యం మత్తులో వున్న గంగరాజు మరలా శ్రీనుని కొట్టడానికి ప్రయత్నించగా శ్రీను పారిపోతుండగా అడ్డుగా వెళ్లిన బుజ్జి పరుగెత్తి పడిపోయింది. దీంతో గంగరాజు అక్కడ వున్న సిమ్మెంటు ఇటుకతో ఆమె తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గంగరాజు వివరించారు. నిందితుడిని బిక్కవోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.