నగదు చోరీ చేసిన కేసులో రాజానగరం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన వరదా మణికంఠ ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంటలో నివసిస్తూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 22న కుంట నుంచి బొలెరోలో వస్తూ గామన్ బ్రిడ్జి రోడ్డులోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో బహిర్భూమికి ఆగాడు. అప్పటికే అక్కడ తుప్పల్లో నక్కి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని కత్తితో బెదిరించి రెండు బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్, రూ.10వేలు లాక్కొని పారిపోయారు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. కొంతమూరుకు చెందిన సాలా బలరామ్(డీజే), బాలం ఏసులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.
హైవేలపై ప్రయాణించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే 112కి ఫోన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్‌ఐ మనోహర్, మహిళా ఎస్‌ఐ రేవతి, హెచ్‌సీ అమ్మిరాజు, పీసీలు పవన్‌కుమార్, వెంకటరమణను అభినందించారు. అయితే బహిర్భూమికి వెళ్లడం వాస్తవం కాదని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో విటులు బంగారు ఆభరణాలతో ఉన్నా, వాళ్ల వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నట్లు గమనించినా సదరు మహిళలు తాము ముందుగానే ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు లేదా తమకు అనుకూలమైన పోలీసులకు సమాచారం ఇచ్చి ప్లాన్ ప్రకారం దోపిడీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. తర్వాత చోరీ సొత్తును వారంతా వాటాలు వేసుకుంటారని సమాచారం. చాలా మంది ఇలా దోపిడీకి గురైనా చట్ట వ్యతిరేక పని కావడంతో తమపైన కేసు పెడతారనే భయంతో మిన్నకుండిపోతున్నారు. దీంతో తాము దోపిడీకి గురైనా పోలీసులకు ఫిర్యాదు అందడం లేదని సమాచారం.