బాల, బాలికల మిస్సింగ్ కేసుల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని వారి ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. గురువారం నంద్యాల సబ్ డివిజన్‌కు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నిర్వహించారు. నంద్యాల జిల్లాలో నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రాధాన్యత క్రమంలో వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులపై ఆరాతీశారు. అనంతరం పెండింగ్ కేసులకు సంబంధించిన ఫైళ్లను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులకు శిక్ష పడాలన్నా.. బాధితులకు న్యాయం జరగాలన్నా నేర ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాల సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్ట్, దర్యాప్తు, చార్జిషీటు దాఖలు, కోర్టు ట్రయల్స్ వరకు సిబ్బంది ఎలా వ్యవహరించాలన్న దానిపై ఎస్పీ అవగాహన కల్పించారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం చిన్నపాటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలన్నారు. బీట్స్ రీ ఆర్గనైజ్ చేసి పట్టణాలతోపాటు మారుమూల ప్రాంతాలకు సైతం బీట్స్ తిరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భేదాల్లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తేలికగా తీసుకోవద్దన్నారు.
పీజీఆర్‌ఎస్ పిటీషన్లపై నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని, వాటిని జిల్లా పోలీస్ కార్యాలయానికి కూడా పంపాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నంద్యాల సబ్ డివిజన్‌కు సంబంధించి నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది మారుతున్న చట్టాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ యుగంధర్‌బాబు, ఇన్‌స్పెక్టర్లు మోహన్‌రెడ్డి, విజయభాస్కర్, ఆదినారాయణ, ప్రియతంరెడ్డి, సబ్ డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.