ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 11:49 AM

పలు కారణాలతో నియామకాలు నిలిచిన కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై స్పందించిన ప్రభుత్వం సంబంధిత విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ ఖాళీలను నింపేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వనుంది. ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలం ఆగడాలలంక ప్రాథమిక పాఠశాలలో రెండు ఎస్జీటీ పోస్టులు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సీబీసీఎన్‌సీ హైస్కూలులో ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కలిపి 11, అదే యాజమాన్యానికి చెందిన మరో ప్రాథమిక పాఠశాలలో మూడు ఎస్జీటీ పోస్టుల భర్తీకి విద్యాశాఖ చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. మరికొన్నింటిలోను టీచరు ఖాళీలను భర్తీచేసే అవకాశం లేకపోలేదు. ఈ ఖాళీలను సంబంధిత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని భర్తీని చేపడతారు.


అయితే కేవలం కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన ఎయిడెడ్‌ పాఠశాలల్లో మాత్రమే ప్రస్తుతానికి నియామకాలు పరిమితమని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారమేదీ తమవద్ద లేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిన గత వైసీపీ ప్రభుత్వం 2021లో తీసుకున్న నిర్ణయం మొత్తం ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను భారీగా కుదిపేసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వంలోకి విలీనం చేయాలంటూ బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేయడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతోనో, నిర్వహణ సరిగా లేదన్న కారణాలతోనో ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాలని షరతులు పెట్టింది. తన నిర్ణయాన్ని ఎలాగైనా అమలు చేసేందుకు ఉన్నతాధి కారులతో సంబంధిత ఎయిడెడ్‌ యాజమాన్యాలపై తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చింది. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జిల్లాలో పలుచోట్ల ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలకు దిగిన విషయం విదితమే. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి బదులుగా రెండు ఆప్షన్ల విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఆప్షన్‌–1 ప్రకారం ఎయిడెడ్‌ విద్యాసంస్థకు సంబంధించిన ఆస్తులు, అందులో పనిచేస్తున్న టీచర్లతో సహా ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ ఆప్షన్‌కు అయిష్టంగానో, ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లమేరకో గాని ఉమ్మడి జిల్లాలో 8 పాఠశాలలు, 12 టీచరు పోస్టులను సంబంధిత యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగించాయి.


ఇక ఆప్షన్‌–2ని ఆమోదించిన 138 పాఠశాలల యాజమాన్యాలు ఆస్తులను తమవద్దే ఉంచుకుని, వాటిలో పనిచేస్తున్న 219 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించాయి. ఇలా విలీనమైన వారందరినీ జీరో సర్వీసుతో ప్రభుత్వ పాఠశాలలకు 2022 మార్చిలో సర్దుబాటు చేశారు. జీరో సర్వీసు వల్ల అత్యధికంగా నష్టపోయిన టీచర్లలో ఆర్‌సీఎం యాజ మాన్యానికి చెందినవారే ఉన్నారు. వీరంతా కౌన్సెలింగ్‌లో సుదూరప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సివచ్చింది. కళాశాల విద్యలోనూ ఇదే దుస్థితి ఏర్పడింది. ఎయిడెడ్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న పలువురు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించగా, వారిలో అత్యధికులు ఇతర జిల్లాలకు బదిలీ/సర్దుబాటుపై వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు ప్రభుత్వ నిధులతో నడిచే సంబంధిత ఎయిడెడ్‌ కళాశాలలన్నీ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను వదులుకోవడంతో ఆయా కోర్సులకు ఫీజులు కొన్నిరెట్లు పెరిగాయంటూ విద్యార్థి సంఘాలు జగన్‌ ప్రభుత్వచర్యను బాహాటంగానే ఎండగట్టాయి. ఇప్పటికే ప్రభుత్వంలోకి విలీనం చేసిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు కొత్తగా టీచరు పోస్టులను మంజూరు చేయడం లేదా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న (ఎయిడెడ్‌) టీచర్లను తిరిగి ఆయా పాఠశాలలకు వెనక్కి పంపడం గాని సాంకేతికంగా సాధ్యం కాదని చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో 18 ఎయిడెడ్‌ పాఠశాలలుండగా, మొత్తం 3,546 మంది విద్యార్థులున్నారు. వీటిలో 11 ప్రాథమిక పాఠశాలల్లో 50 శాంక్షన్డ్‌ ఎస్జీటీ పోస్టులకు ప్రస్తుతం 21 మంది వర్కింగ్‌ టీచర్లున్నారు. ఇక 7 ఉన్నత పాఠశాలల్లో 165 స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ శాంక్షన్డ్‌ పోస్టులకు ప్రస్తుతం 58 పోస్టుల్లో మాత్రమే టీచర్లు పనిచేస్తున్నారు. చివరిసారిగా ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఉపా ధ్యాయ నియామకాలను 2003లో అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 84 ఎయిడెడ్‌ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చు కోవడంతో తదుపరి సంవత్సరాల్లో కొన్నింటిలో నియామకాలు జరిగాయి. కొన్నిం టిలో పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా జరిగే ఎయిడెడ్‌ నియామకాలన్నీ ఇదే కోవ లోకి వస్తాయని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఎయిడెడ్‌ యాజమాన్యం తమకు టీచర్‌ పోస్టులు కావాలంటూ ప్రభుత్వాన్ని లేదా కోర్టుని ఆశ్రయిస్తే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సర్‌ప్లస్‌ (మిగులు)గా వున్న సుమారు 400 ఎస్జీటీ ఉపాధ్యాయులను సర్దుబాటుపై నియమించే అవకాశాలున్నట్టు సమా చారం. అయితే సంబంధిత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై అధార పడి ఉంటుంది. వీటన్నింటిపైనా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలుండగా 2004 మంది విద్యార్థులున్నారు. మూడు యూపీ స్కూళ్లు ఉండగా 135 మంది విద్యార్థులు, 12 ప్రాథమిక స్కూళ్లు ఉండగా 421 మంది విద్యార్థులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com