చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులే తప్ప ఎలాంటి మేలు జరగటం లేదని వైయస్ఆర్‌సీపీ నేత చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. నెల్లూరులో మైకు పని చేయలేదని ఐ అండ్ పీఆర్ అధికారిని చంద్రబాబు అందరిముందు అవమానపరచారు. గతంలో కూడా జన్మభూమి సమావేశాల్లో అధికారులను ఇలాగే బెదిరించారు. కొంతమంది ఉద్యోగులు అక్కడే గుండెపోటుతో కుప్పకూలారు. అధికారులు ఏ ప్రభుత్వంలోనైనా పని చేస్తారు. కానీ చంద్రబాబు కొంతమందిని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పని చేసిన అధికారులను చంద్రబాబు వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటి వారిని కూడా చంద్రబాబు వేధిస్తున్నారు’’ అని చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘జత్వానీ కేసులో కూడా ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై వేటు వేశారు.
రూల్స్ ప్రకారం పని చేస్తే ఈ వేధింపులేంటి?. చంద్రబాబు చెప్పిన రూల్స్ వ్యతిరేక పనులు చేయడం సాధ్యం కాదు. అంతమాత్రానికే వారిని వేధిస్తారా?. రెడ్‌బుక్ రాజ్యాంగం రాసుకుని దాన్ని ఫాలో అవమంటే అధికారులు ఎందుకు చేస్తారు?. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే అధికారులు పని చేస్తారని చంద్రబాబు, లోకేష్ గుర్తించాలి. విద్యా సంవత్సరం కూడా చూడకుండా ఉద్యోగుల బదిలీలు చేయటం కరెక్టు కాదు. రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది. పొలిటీషియన్లకు కప్పం చెల్లించిన వారికే కావాల్సిన చోటుకు బదిలీ చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు మరింతగా అల్లాడిపోతున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి?. ఐఆర్, పీఆర్‌సీ సంగతి ఏం చేశారో తెలియటం లేదు. ఉద్యోగులకు ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలి. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పది శాతం ఇవ్వాలి. విశాఖ ఉక్కు పరిశ్రమలో లక్షమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పరిశ్రమని ప్రైవేటు పరం చేస్తే వారందరి జీవితాలకు ఇబ్బంది వస్తుంది. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చూడాలి. ఉద్యోగులందరికీ వైద్య పరంగా ప్రభుత్వ సహకారం ఉండాలి. ఓపిఎస్ కోసం సీపీఎస్ ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. వారందరికీ న్యాయం చేయాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి. జాబ్ కేలండర్‌ను త్వరగా విడుదల చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. కాకినాడలో ప్రొఫెసర్ పై దాడి చేసిన ఎమ్మెల్యే నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు ప్రభుత్వం భద్రత కల్పించాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి కోరారు.