ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా మతం ఇదే, కావాలంటే రాసుకోండి.. వైఎస్ జగన్ ఎమోషనల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 07:06 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది. ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.


"ఇలాంటి పరిస్థితి రాజకీయ జీవితంలో చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణం. ఇలాంటి పరిస్థితులు దేశంలోనే ఎప్పుడూ చూడలేదు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని వైసీపీ వాళ్లకు నోటీసులు ఇచ్చారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకు బీజేపీ వాళ్లు వస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. జరగని విషయాన్ని జరిగినట్లు కల్తీ నెయ్యి అంటూ అబద్ధాలు చెప్తున్నారు. తిరుపతి లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకు వచ్చారు.కూటమి వందరోజుల పాలనను డైవర్ట్ చేయడానికే తిరుపతి లడ్డూ వ్యవహారం తెరపైకి తెచ్చారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేయిస్తున్నారు. టీటీడీలో నెయ్యి కొనుగోలు ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతోంది. దాన్నేమీ మేము మార్చలేదు. టీటీడీలో తప్పు చేయాలన్నా తప్పులేని వ్యవస్థ ఉంది. ఏ నిర్ణయమైనా సభ్యులు అందరూ కలిసి తీసుకుంటారు." అని వైఎస్ జగన్ చెప్పారు.


తిరుమలలో నెయ్యి కొనుగోలుపై ఆరు నెలలకు ఓసారి సమీక్ష జరుపుతారని వైఎస్ జగన్ అన్నారు. అలాగే క్వాలిటీలో ఏదైనా తేడా ఉంటే ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారన్నారు. జులై ఆరో తేదీన వచ్చిన నాలుగు ట్యాంకర్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని.. వాటిని వెనక్కి పంపారని జగన్ అన్నారు. అయితే వాడని నెయ్యిని వాడినట్లు, ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. జులై 23న టీటీడీ ఈవో.. నెయ్యిలో వనస్పతి ఆయిల్ కలిసిందనే కారణంతో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినట్లు చెప్పారని జగన్ గుర్తు చేశారు. ఆ నెయ్యిని వాడలేదని చెప్పారన్నారు. అయితే చంద్రబాబు ఆరోపణల తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావు సెప్టెంబర్ 20న మరోసారి విలేకర్ల సమావేశం నిర్వహించి.. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడలేదని చెప్పారని జగన్ గుర్తుచేశారు.


తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని సెప్టెంబర్ 22న టీటీడీ ఈవో రిపోర్టు కూడా ఇచ్చినట్లు జగన్ తెలిపారు. అయితే ఇంత తెలిసినా కూడా చంద్రబాబు తిరుమల లడ్డూపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. టీటీడీ ఈవో రిపోర్టు తర్వాత కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఆ నెయ్యిని వాడేశారంటూ తిరుమల పవిత్రతను తగ్గించేలా అబద్ధాలు చెప్తున్నారని జగన్ విమర్శించారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు.


" మా నాన్న వైఎస్ఆర్ ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా. పాదయాత్రకు ముందు శ్రీవారి దర్శనం చేసుకున్నా. పాదయాత్ర పూర్తయ్యాక.. కాలినడకన తిరుమల కొండెక్కి వెంకన్న దర్శనం చేసుకున్నా. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియవా? చంద్రబాబుకు తెలియవా? ఆ తర్వాతే ముఖ్యమంత్రిని అయ్యా. సీఎం హోదాలో ఐదుసార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించా. నేను తిరుమల వెళ్లడం ఇదే తొలిసారి కాదు. పది, పన్నెండుసార్లు తిరుమలకు వెళ్లినవాడికి నోటీసులు ఇస్తారా?. ఈ రోజు నేను తిరుమలకు రాకూడదట, కారణం నా మతమట. నా మతం, కులం ఏంటో ప్రజలకు తెలియదా?. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా. బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తా. నా మతం మానవత్వం. కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోండి.. అంటూ జగన్ ఎమోషనల్ అయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com