ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాలను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించింది.. అలాగే వార్డు, గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్‌రిజిస్ట్రార్లుగా గుర్తించారు. అయితే ఆ ఉత్తర్వుల్ని ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ ప్రకటన చేశారు. వెటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆగస్టులోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు నిలిపివేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
గత ప్రభుత్వం 2022 నుంచి దశల వారీగా 4,173 గ్రామాల పరిధిలోని ఆస్తుల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ విధానాన్ని 3,645 సచివాలయాల్లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మేరకు మొత్తం 4,976 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. సచివాలయాల్లో తగిన ఏర్పాట్లు, సదుపాయాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై సమీక్ష చేసి.. గత ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
గత ప్రభుత్వ రిజిస్ట్రేషన్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలకు జాయింట్ రిజస్టార్ కార్యాలయాల హోదా కల్పించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పేదలకు ఇళ్ల స్థలాల పథకం కింద ఇచ్చిన సెంటు భూమిని రిజిస్ట్రేషన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కానీ ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు.. ఈ రిజిస్ట్రేషన్ విధానం వల్ల అనవసర వివాదాలు రావడంతో.. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉత్తర్వుల్ని వెనక్కు తిసుకుంది.
మరోవైపు రాష్ట్రంలో అందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో.. త్వరలో స్థలాల కొనుగోలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పారు గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరు జిల్లా మర్లపాలెంలో మంత్రి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది మార్చిలో గృహనిర్మాణ సాయం మొత్తాన్ని పెంచుతామని.. సాయం ఎంత పెంచాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. సొంత స్థలం ఉన్న పేదలు వెంటనే గృహాలు నిర్మించుకునే అవకాశం ఉంది అన్నారు.