తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనే వార్తలపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సుమన్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ అంటే.. భక్తులకు ఓ సెంటిమెంట్ అని చెప్పిన సుమన్.. అంతటి పవిత్రమైన ప్రసాదంలో ఇలాంటి పని చేసిన వారిని వదలకూడదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో కాటన్ షోరూంను ప్రారంభించేందుకు సుమన్ వచ్చారు. షోరూంను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే వార్తలు రావటం చాలా దురదృష్టకరమని సుమన్ అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన ఇలాంటి అంశంలో చేసిన ఈ నేరం.. తీవ్రవాదం కంటే ఎక్కువంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుమలలో డిక్లరేషన్ విషయంపైనా సుమన్ స్పందించారు, డిక్లరేషన్ విషయం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలన్నారు. ఇక టీటీడీ బోర్డులో రాజకీయ నేతలకు కాకుండా భక్తిభావం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
"తిరుమల లడ్డూ చాలా పవిత్రమైనది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు వస్తున్నాయి. అదే నిజమనుకుంటే టీటీడీ బోర్డు ఏం చేస్తోంది.. అధికారులు ఏం చేస్తున్నారు? నెయ్యి ట్యాంకర్లను పరీక్ష చేస్తారుగా.. ఎలా అది ముందుకు వెళ్లింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి.. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఓసారి అనుమానం వస్తే తప్పుచేసినా, చేయకపోయినా అది అందరికీ చుట్టుకుంటుంది. దేవుడి ప్రసాదాన్ని అలా చేయడం మహా పాపం. తిరుపతి లడ్డూ అంటే భక్తులకు సెంటిమెంట్. భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసేలా అలా చేసిన వారిని వదలకూడదు. పార్లమెంటులో ఎన్నో బిల్లులు ఆమోదిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తప్పు చేసినవారిని రెండేళ్లు జైళ్లో వేసేలా ఓ బిల్లు తేవాలి. ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇలాంటి విషయాల్లో చేసిన ఈ నేరం.. టెర్రరిజం కంటే ఎక్కువ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు నా విజ్ఞప్తి. తప్పు చేసిన వారిని వదలకూడదు. వారిని కఠినంగా శిక్షించాలి." అని సినీ నటుడు సుమన్ అన్నారు.
మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. శనివారం తిరుమల వెంకన్నస్వామిని సిట్ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందం.. ఈ విషయంలో దర్యాప్తు జరుపుతోంది. మూడు రోజుల పాటు తిరుపతిలోనే ఉండి.. దీనిపై విచారణ జరపనున్నారు. శ్రీవారి లడ్డూ పోటు, మార్కెటింగ్ విభాగాలతో పాటుగా పలు విభాగాలలో సిట్ పరిశీలన జరపనుంది. అనంతరం నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. సిట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.