దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్‌ను వెంటాడి కారుతో ఈడ్చుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశారు. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయిలో ఈ తెల్లవారుజామున 2.15 గంటలకు జరిగిందీ ఘటన. ఆ సమయంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారు. కారులో మద్యం తాగుతున్నందుకు ప్రశ్నించిన కానిస్టేబుల్ సందీప్ మాలిక్ (30)ను కారుతో తొక్కించి హత్య చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకడైన రజనీశ్‌ను అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అందులో మద్యం బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సందీప్ మాలిక్.. కారులో మద్యం తాగుతున్న రజనీశ్, ధర్మేందర్‌ను గమనించి ప్రశ్నించాడు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితులు ‘ఈ రోజు నిన్ను చంపకుండా వదలం’ అని ఆగ్రహంతో ఊగిపోతూ మాలిక్‌ను వెంబడిస్తూ కారుతో ఢీకొట్టి 30 అడుగుల దూరం ఈడ్చుకెళ్లి ఆపై కారుతో తొక్కించి హత్య చేశారు.ఈ కేసులో తొలుత మాఫియా కోణం ఉన్నట్టు వార్తలొచ్చినా పోలీసు అధికారులు దీనిని ఖండించారు. ‘పని పూర్తిచేయాలని’ మద్యం సరఫరాదారు జంగ్రా నిందితులను ఆదేశించినట్టు ప్రాథమికంగా డైరీ ఎంట్రీలో పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఇందులో ఎలాంటి మాఫియా కోణం లేదని తర్వాత వివరణ ఇచ్చారు. మాఫియా కోణం ఆరోపణలకు తగ్గట్టుగానే కానిస్టేబుల్ వచ్చే వరకు కారు అక్కడ ఆగి ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సందీప్ హత్య ఘటన అక్కడి సీసీటీవీల్లో రికార్డైంది. కారుతో తొక్కించడంతో తీవ్రంగా గాయపడిన సందీప్‌ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మరో ఆసుపత్రికి మార్చినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.