ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగనుంది. ఉమ్మడి కృష్ణా - గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ కూటమి కంటే ముందుగానే వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థిని ఖరారు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్న వైసీపీ.. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా సీనియర్ లీడర్ పొన్నూరు గౌతంరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. స్థానిక నేతలు, కార్యకర్తలతో చర్చించిన మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మరోవైపు ఈ స్థానం నుంచి కూటమి తరుఫున ఎవరు బరిలోకి దిగుతారనేదీ ఆసక్తికరంగా మారింది. అయితే కూటమి తరుఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ సీటు ఆయనదేనని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కూటమి కంటే ముందుగానే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి కాస్త సానుకూలత ఉంటుంది. అయితే ఎన్నికల సమయానికి టీడీపీ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే అంచనాతో వైసీపీ ఉంది. సూపర్ సిక్స్ హామీల అమల్లో జాప్యం తమకు కలిసి వస్తుందనే ఆలోచనలో ఉంది. ఇక తూర్పు- పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.
మరోవైపు ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫాం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. మరోవైపు ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఓటర్ల నమోదుకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది.