‘బుడమేరు, కొల్లేరు ఆక్రమణలను తక్షణమే తొలగించాలని సీఎం చంద్రబాబును కోరాం. ఆక్రమణలు తొలగించకపోతే సమస్య పరిష్కారం కాదని సీఎంకు తెలిపామని, ఆయన సానుకూలంగా స్పందించారని సిపిఎం నేత రామకృష్ణ అన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు బుడమేరు ఆక్రమణలను కచ్చితంగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. వరద బాధితులకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులు, దాతల నుంచి సమీకరించిన నిధులతో సహాయక చర్యలు చేపట్టారు.
వరద వల్ల నష్టపోయిన ఆటో యజమానులకు ఇస్తున్న రూ.10 వేలును రూ.25,000 చేయాలని సీఎంను కోరాం. ఆయన పరిశీలిస్తామని చెప్పారు. తిరువూరు ప్రాంతంలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు మంచినీరు సరఫరా చేయాలని, డయాలసిస్ చేయించుకునే వారందరికీ ఆర్థిక సహాయం చేయాలని కోరాం. అగ్రీగోల్డ్ సమస్యను పరిష్కరించాలని కోరాం. చేనేత కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చించాం. పోలవరం నిర్వాసితుల సమస్యను ప్రాధాన సమస్యగా తీసుకుని పరిష్కరించాలని కోరాం’ అని రామకృష్ణ తెలిపారు.