రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముగిసింది. ఈ సీజన్‌లో 32.50 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 27.44 లక్షల హెక్టార్లలో (84%) పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీ్‌ఫలో 24.09 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది. అయితే సాధారణ సాగు కన్నా 5 లక్షల హెక్టార్లలో పంట తగ్గింది. నిరుటితో పోల్చితే మాత్రం.. ఈ ఏడాది 3.35 లక్షల హెక్టార్లలో పెరగడం గమనార్హం. ప్రధాన పంటలైన వరి సాగు 10%, పత్తి 33%, వేరుశనగ 48% తగ్గింది. చిరుధాన్యాలు, అపరాలు, ఇతర నూనె గింజల పంటల సాగులో పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 21% అధిక వర్షపాతం నమోదైనా.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు.. మరికొన్ని జిల్లాల్లో సకాలంలో వానలు పడకపోవడం వల్ల ఖరీఫ్ సాగుపై గందరగోళం ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. మెట్టప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి వాతావరణం వల్ల పత్తి సాగు, వేరుశనగ, మిర్చి కూడా సాధారణ స్థాయిలో సాగవ్వలేదు. అయితే నీటి వనరులున్న ప్రాంతాల్లో మిర్చి నారుమళ్లు సాగుతున్నాయి. ఈ ఏడాది రాయలసీమలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వేరుశనగ సాగుపై ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే కోస్తాలోనూ అతివృష్టి, అనావృష్టి వల్ల పత్తి సాగు తగ్గింది. అయితే జొన్న, సజ్జ, కొర్ర, రాగుల వంటి చిరుధాన్యాలు, కంది, మినుము, పెసర, ఉలవ వంటి అపరాలు, ఆముదం, సోయాబిన్, సన్‌ఫ్లవర్ వంటి నూనెగింజల సాగు ఆశాజనకంగా ఉంది.