రాష్ట్రంలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న భూ వివాదాల శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కలెక్టర్ల సదస్సు రెండో రోజున భూ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ భూముల వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, వచ్చే కలెక్టర్ల సమావేశంలో ఇదే మొదటి అజెండాగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విశాఖపట్నంలోని కొన్ని భూ వివాదాల్లో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటోందంటూ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదుల గురించి ప్రస్తావించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకూడదని, భూ కబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని తేల్చి చెప్పారు. విశాఖ, అనకాపల్లి సహా మరికొన్ని జిల్లాల్లో భూ కబ్జాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.గత ఐదేళ్ల పాలనలో (2019-24) భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమంగా నిర్వహించిన రెవెన్యూ రికార్డులను గందరగోళంలోకి నెట్టారని అన్నారు. ప్రజలకు చెందాల్సిన భూములను దక్కకుండా చేసేందుకు, వాటిని వివాదాల్లోకి నెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా 22ఏ జాబితాలో చేర్చారని విమర్శించారు. దీనివల్లే ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం భూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయని పేర్కొన్నారు. భూ సమస్యలను వంద శాతం పరిష్కరించి, ప్రజలకు సక్రమంగా డాక్యుమెంట్లు అందించాల్సిన పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని పునరుద్ఘాటించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకువచ్చేందుకు అన్ని రిజిస్ట్రేషన్, ఆస్తి పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని సీఎం వివరించారు. లింక్ డాక్యుమెంట్లను కూడా డేటా వేర్‌హౌస్‌లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను వెంటనే జారీ చేయాలని, ఇకపై ప్రింటింగ్ అయిన చోట నుంచే నేరుగా రైతులకు చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు కూడా నేరుగా యజమానుల ఇళ్లకే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. 20-30 ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.చివరగా, జిల్లాల వారీగా రెవెన్యూ రాబడులపై దృష్టి సారించాలని, పన్ను ఎగవేతలు, మానిప్యులేషన్ జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం ఒక్కరోజు కూడా ఆదాయం కోల్పోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మొత్తంగా, భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa