ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. ఈ నెల (అక్టోబర్)లో బియ్యంతో పాటుగా కందిపప్పు కూడా పంపిణీ చేస్తోంది.. అలాగే చక్కెర కూడా వినియోగదారులకు అందిస్తున్నారు. వాస్తవానికి రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటుగా కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి వంటి వస్తువుల్ని కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటి పంపిణీ సరిగా సాగలేదు.. ఏపీలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ముందుగా పౌరసరఫరాలశాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది.. ఈ క్రమంలో రేషన్ షాపుల కొలతల్లో తేడాల కారణంగా మూడు నెలలుగా కందిపప్పు, చక్కెర, గోధుమపిండిని పంపిణీని నిలిపివేశారు. అయితే ఈ నెల నుంచి కందిపప్పు పంపిణీని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే కందిపప్పు ఆయా జిల్లాలకు చేరగా..
అక్టోబరు నుంచి రేషన్‌లో లబ్ధిదారులకు కేజీ చొప్పున కందిపప్పు అందిస్తారు.
కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.150- 170 వరకు ఉండగా.. రాయితీపై రూ.67కే అందించనున్నారు. అలాగే చక్కెర అర కిలో రూ.17కే అందించనున్నారు. దసరా, దీపావళి పండుగలు ఉండటం.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఈ నెల నుంచే కందిపప్పును పంపణీ చేస్తోంది. అంతేకాదు మిగిలిన సరుకులైన గోధుమపిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్‌తో పాటూ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో రేషన్ షాపుల్ని కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రేషన్ సరకుల్లో అక్రమాలు, అవకతవకలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. కాంట్రాక్టర్లు సరఫరా చేసే కందిపప్పు, పంచదార ప్యాకెట్ల తూకాల్లో తేడాలు ఉన్నట్లు తేల్చింది. వెంటనే వాటి పంపిణీని నిలిపివేసింది.. ఈ ఏడాది జూన్‌లో లీగల్ మెట్రాలజీ అధికారులు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించి కందిపప్పు, పంచదార ప్యాకెట్ల కొలతల్లో తేడాలున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే లోపాలను సవరించి, సక్రమమైన కొలత, కొత్త ప్యాకింగ్‌తో సెప్టెంబరు నుంచి లబ్ధిదారులకు పంచదార పంపిణీ పునః ప్రారంభించారు. ప్రస్తుత నెల నుంచి కందిపప్పును కూడా రేషన్‌లో అందిస్తున్నారు. బియ్యం కార్డుదారులకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేస్తారు.