ఇటీవల ఆఫీసుల్లో పని ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం లేదా అనారోగ్యం బారిన పడి చనిపోతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగంలో పని ఒత్తిడి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడటం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మరోసారి పని ఒత్తిడి గురించి మళ్లీ చర్చ తెరపైకి వచ్చింది.
ముంబైలోని అటల్ సేతు పైనుంచి దూకి 40 ఏళ్ల సుశాంత్ చక్రవర్తి అనే బ్యాంక్ మేనేజర్ ప్రాణాలు వదిలేశాడు. అటల్ సేతుపైకి కారులో వచ్చిన సుశాంత్ చక్రవర్తి.. తన కారును పక్కకు ఆపి కిందికి దిగాడు. ఆ తర్వాత బ్రిడ్జి పైనుంచి సముద్రంలోకి దూకాడు. సుశాంత్ చక్రవర్తి.. ముంబైలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సుశాంత్ చక్రవర్తికి భార్య, ఏడాది వయసు ఉన్న కుమార్తె, తల్లి ఉన్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే సుశాంత్ చక్రవర్తి మృతి గురించి ఆమె భార్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త చాలా కాలంగా ఆఫీసులో తీవ్ర పనిభారంతో ఆందోళన చెందుతున్నాడని పోలీసులకు వివరించింది. ఇక ఇటీవలె సుశాంత్ చక్రవర్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్ చక్రవర్తి మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక పూణేలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పనిచేసే 26 ఏళ్ల సీఏ అన్నా సెబాస్టియన్ మృతితో ఈ పని ఒత్తిడికి సంబంధించి చర్చ మొదలైంది. ఆ తర్వాత బెంగళూరులో ఓ టెకీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ఫైనాన్స్ ఉద్యోగి, ఇక అదే రాష్ట్రంలో ఓ బ్యాంకు ఉద్యోగిని కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలేసిన సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతుండటంతో ఆఫీసుల్లో పని ఒత్తిడి పట్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.