తొలి బుల్లెట్ రైలు కోసం భారత రైల్వే ప్రయాణికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2026 నాటికి దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ తొలి బుల్లెట్ రైలు కోసం మహారాష్ట్రలోని ముంబై నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు జపాన్ సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారత్-జపాన్‌ల మధ్య చాలా విషయాల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. వీటిని పరిష్కరించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేతృత్వంలోని అధికారుల బృందం 3 రోజుల జపాన్ పర్యటనకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం జపాన్ తన కంపెనీల నుంచి కేంద్రం రైలు సెట్లు, సిగ్నలింగ్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రాజెక్టు వ్యయం, పూర్తి చేసే సమయానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది. 2027లో ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును నడపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో రైల్వే బోర్డు సభ్యుడు అనిల్ కుమార్ ఖండేల్వాల్.. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వివేక్ కుమార్ గుప్తా జపాన్ పర్యటనకు వెళ్లారు.
ఇక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈ ఏడాది చివర్లో జపాన్ రాజధాని టోక్యోలో పర్యటించనున్నారు. ఈ 508 కిలోమీటర్ల పొడవు బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భూసేకరణ పనులు పూర్తైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక 215 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. కానీ.. భారత్, జపాన్ మధ్య రోలింగ్ స్టాక్ అంటే రైలు సెట్లు, సిగ్నల్ సిస్టమ్‌లను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చుకు సంబంధించి రెండు దేశాల మధ్య చర్చల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం అన్ని రకాల టెక్నాలజీ, టెక్నాలజీ సపోర్ట్‌ను జపాన్ అందిస్తోంది. అయితే ఇందుకు ఒక షరతు విధించారు. అదేంటంటే సిగ్నలింగ్ సిస్టమ్, రైలు సెట్‌లను జపాన్ కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ యొక్క లోన్ రూల్స్ నిబంధనల ప్రకారం.. కవాసకి, హిటాచీ వంటి జపాన్ కంపెనీలు మాత్రమే ఈ టెండర్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే పెరుగుతున్న ఈ ప్రాజెక్ట్ వ్యయంపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. దీని కోసం మొత్తం బడ్జెట్ రూ.1.08 లక్షల కోట్లు కాగా అందులో ఇప్పటికే రూ.60,372 కోట్లు ఖర్చు చేశారు.
అయితే ఈ ఖర్చులో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేశారు. ఇక రైలు సెట్లు, సిగ్నలింగ్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌కు మరింత ఖర్చయ్యే అవకాశాలుండటంతో మొత్తం ప్రాజెక్టు వ్యయం పెరగనున్నట్లు తెలుస్తోంది. షింకన్‌సెన్ టెక్నాలజీపై ఆధారపడిన జపాన్ రైలు సరిగ్గా 60 సంవత్సరాల క్రితం 1964 అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించారు. ఇక మన దేశంలో రానున్న బుల్లెట్ రైలు ముంబై నుంచి అహ్మదాబాద్‌కు దాదాపు 3 గంటల్లోనే 508 కిలోమీటర్ల దూరాన్ని చేరుతుందని తెలుస్తోంది. సూరత్- బిలిమోరా మధ్య ఈ బుల్లెట్ రైలు 2026లో ప్రారంభమవుతుందని ఈ ఏడాది ప్రారంభంలో అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో ఈ గడువు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.