చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి ఓ ఐదేళ్లు వచ్చే వరకు అనేక క్రతువులు నిర్వహిస్తుంటారు. పురుడు, బారసాల, నామకరణ మహోత్సవం, అన్నప్రాసన, చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయడం, ఆడ పిల్లలు అయితే గాజులు వేయడం అలా ప్రతీ దాన్ని పండగలాగే జరుపుకుంటారు. అలాంటి ఓ కార్యక్రమమే చేయబోయిందో కుటుంబం. ముఖ్యంగా తమ ఆరు నెలల శిశువుకు చెవులు కుట్టించాలనుకున్నారు. అయితే బిడ్డ నొప్పిని తట్టుకోలేడని భావించి మత్తు సూది ఇప్పించారు. అదే వారు చేసిన తప్పు అయింది. దాని వల్లే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లా గుండ్లుపేట తాలూకాలోని హంగల గ్రామానికి చెందిన ఆనంద్, శోభ దంపతులకు ఇటీవలే పండంటి మగ బిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్న ఈ కుటుంబం.. బాలుడికి సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. అయితే చిన్నారికి ఆరు నెలలు నిండగా చెవులు కుట్టించాలని భావించారు. అయితే అంత చిన్న పిల్లాడికి చెవులు కుట్టిస్తే నొప్పి భరించలేక ఏడుస్తాడని ఆలోచించారు.
కుటుంబం అంతా కలిసి ఆలోచించి మరీ చిన్నారికి చెవులు నొప్పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో నిర్ణయించింది. ముఖ్యంగా బాలుడికి మత్తు సూది ఇప్పిస్తే.. నొప్పి తెలియదని అప్పుడు చెవులు కుట్టిస్తే బాబు ఏడవకుండా ఉంటాడని అనుకున్నారు. ఈక్రమంలోనే బొమ్మలాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడి వైద్యులకు ఈ విషయం చెప్పారు. తమ కుమారుడికి మత్తు సూది ఇస్తారో లేదో కనుక్కున్నారు. అయితే అక్కడే ఉన్న వైద్యుడు ఇస్తామని అందుకు 200 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో కుటుంబం చెవులు కుట్టించుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకుంది.
ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మంచి రోజు ఉండగా.. బాబును తీసుకుని ముందుగా బొమ్మలాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. ఈక్రమంలోనే డ్యూటీలో ఉన్న వైద్యుడు శిశువు చెవులకు మత్తు సూది ఇచ్చారు. ఐదు నిమిషాలు కాగానే బాలుడు పూర్తిగా స్పృహ కోల్పోయాడు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు అతడిని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి గొడవ చేశారు. మత్తు డోస్ ఎక్కువ అవడం వల్లే బాలుడు చనిపోయాడంటూ వైద్యులతో గొడవకు దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. బాలుడికి పోస్టుమార్టం నిర్వహిస్తే.. అతడి మృతికి గల కారణం తెలుస్తుందని నిజంగానే వైద్యుడు తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కాస్త వెనక్కి తగ్గారు. తమకు కచ్చితంగా న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. చెవులు కుట్టించే కార్యక్రమంలోనే బాలుడు చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు సహా బంధువులు అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు.