ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజినెస్ రంగంలోకి కంగనా రనౌత్.. హిమాలయాల్లో వాలెంటైన్స్ డే రోజున ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 09:53 PM

బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేసి.. తొలి ప్రయత్నంలోనే లోక్‌సభకు ఎన్నికయ్యారు. బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న కంగనా రనౌత్.. రాజకీయాల్లో కూడా అదే ఫైర్ చూపించారు. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కంగనా రనౌత్.. తాజాగా వ్యాపార రంగంలోనూ తన ప్రతిభ చాటుకోవడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే తాను బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా కంగనా రనౌత్ తాజాగా ప్రకటించారు.


హిమాలయాల్లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసినట్లు కంగనా రనౌత్ వెల్లడించారు. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా.. తన రెస్టారెంట్‌ను ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు. "ది మౌంటెన్‌ స్టోరీ" పేరుతో ఒక చిన్న కేఫ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అయితే రెస్టారెంట్‌ను ప్రారంభించాలి అనేది తన చిన్న నాటి కల అని ఈ సందర్భంగా కంగనా రనౌత్ స్పష్టం చేశారు తెలిపారు. ఇప్పటికి తన కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.


ఇక సంప్రదాయ హిమాచల్‌ ప్రదేశ్ ఫుడ్‌ను.. ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా "ది మౌంటెన్ స్టోరీ"ని ఏర్పాటు చేసినట్లు కంగన తెలిపారు. ఈ మేరకు ఆ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. కంగన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "నా చిన్ననాటి కల సజీవంగా ఉంది. హిమాలయాల్లో నా చిన్న కేఫ్. ది మౌంటెన్ స్టోరీ. ఇదో ప్రేమకథ" అని ఇన్‌స్టాలో కంగన తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు, పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుండటంతో.. నెటిజన్లు, కంగన ఫ్యాన్స్.. ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ ఫుడ్‌ బిజినెస్‌లో అడుగుపెట్టారు. శిల్పాశెట్టి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మలైకా అరోరా, మౌనీరాయ్‌ వంటి హీరోయిన్లకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి.


మరోవైపు.. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్‌ నటించారు. ఈ ఎమర్జెన్సీ సినిమా జనవరి 17వ తేదీన రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చింది. జయప్రకాష్ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌.. అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు. ఈ సినిమా తర్వాత కంగనా రనౌత్ మాధవన్‌తో ఒక సినిమా చేస్తుండగా.. షూటింగ్ కూడా ఇటీవలె ప్రారంభమైనట్లు ఆమె సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com