దేశ రాజధాని ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మూడు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ జరుగుతుండగా.. ఈసారి అధికారం ఎవరు దక్కించుకోబోతున్నారో తెలుసుకునేందు దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పటి వరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సార్లు గెలుపొందిన పార్టీ ఏది, ఎవరెవరు ముఖ్యమంత్రులుగా పని చేశారు, మొత్తం ఎన్ని సార్లు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో మొదటి శాసన సభ ఎన్నికలు 1952లో జరిగాయి. కానీ రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఢిల్లీని భారత రాష్ట్రపతి ప్రత్యక్ష పరిపాలనలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే ఢిల్లీ శాసనస భను కూడా రద్దు చేశారు. కానీ 1991లో 69వ సవరణ ద్వారా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని అధికారికంగా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత అంటే 1993లో తొలి సారిగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.
ముఖ్యంగా 1993 నవంబర్ 6వ తేదీన నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. 70 సీట్లకు గాను బీజేపీ 49 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లను, జనతా దళ్ 4 స్థానాలను, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలను గెలుచుకున్నారు. ఇలా బీజేపీ అధికారాన్ని దక్కించుకోగా.. మదన్ లాల్ కురానా తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. పీవీ నరసింహారావు ప్రధానిగా పని చేశారు.
ఇక రెండోసారి 1998లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. 52 స్థానాలు దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీకి 17 స్థానాలు రాగా జేడీయూకి ఒకే ఒక్క స్థానం లభించింది. ఇలా ఢిల్లీ రెండో ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పని చేశారు. అప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా.. అటల్ బిహారీ వాజ్‌పేయూ ప్రధానిగా పని చేశారు.
ఇక మూడోసారి 2003లో జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో 70 స్థానాకలు గాను.. కాంగ్రెస్ 47 స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి 20, జేడీయూకి 1, ఎన్‌సీపీకి 1, స్వతంత్ర అభ్యర్థికి ఒక స్థానం రాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలా ఢిల్లీ మూడో ముఖ్యమంత్రిగా మళ్లీ షీలా దీక్షిత్‌యే నియమితులయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగా.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు.
నాలుగో సారి 2004లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌యే విజయం సాధించింది. 70 సీట్లకు గాను కాంగ్రెస్ 43, బీజేపీ 23, బీఎస్పీ 2, ఎల్‌జేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటు గెలుచుకోగా.. నాలుగో సీఎంగా కూడా షీలా దీక్షిత్‌యే పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్‌యే అధికారంలో ఉండగా మన్మోహన్ సింగ్‌యే ప్రధాన మంత్రిగా పని చేశారు.
అయితే ఐదో సారి 2013లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆమ్ అద్మీ పార్టీ విజయం సాధించింది. కేవలం 28 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆప్.. 8 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీకి 31 సీట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక సీటు, జేడీయూకు ఒక స్థానం, ఎస్ఏడీకి ఒక స్థానం వచ్చింది. ఇలా ఐదో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేంద్రంలో ఏడాది పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. 2014లో బీజేపీ గెలిచింది. అలాగే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు.
ఇక 2015లో ఆరోసారి ఢిల్లీకి శాసన సభ ఎన్నికలు జరగ్గా.. ఆమ్ ఆద్మీ పార్టీ 66 స్థానాలు గెలుచుకుని విజయం సాధించింది. బీజేపీ 4 సీట్లు రాగా.. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఇలా ఆరోసారి ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్‌యే పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉండగా.. ప్రధానిగా మోదీ పని చేస్తున్నారు. ఇక ఏడో సారి 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ 62 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది.
ఇలా ఏడో ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టగా.. లిక్కర్ స్కాంలో ఇరుక్కుని జైలుకు వెళ్లారు. అక్కడి నుంచి పాలన అందించడం కష్టం కావడంతో.. 2024 సెప్టెంబర్ నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీకి పదవీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. మరి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోబోతున్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.