ఏలూరు కాల్ మనీ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపుడి అనిత.. అధిక వడ్డీలు, అక్రమ వసూలు చేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. సామాన్య ప్రజలను వడ్దీల పేరుతో ఇబ్బంది పెట్టరాదని అన్నారు. కిస్తీలకు ముందే వడ్డీ కోత, గడువు దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారంపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ వసూళ్లతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వడ్డీ వ్యాపారాలను సీరియస్‌గా తీసుకున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. రోజూవారీ వడ్డీల పేరిట సామాన్య జనాలను వేధించేవారిని విడిచిపెట్టేది లేదని తెలిపారు. వైసీపీ నేత కాల్ మనీ దందాకు తాము బలయ్యామని ఇటీవల ఏలూరులో బాధితులు తమ గోడును వెళ్లబోశారు. తాము తీసుకున్న అప్పుకు అధిక వడ్డీలు కట్టించుకున్నారని వాపోయారు. సమయానికి అప్పు చెల్లించకపోతే అసభ్యపదజాలంతో తిట్టేవారని, భయపడి కట్టినా ఇంకా బకాయి ఉన్నారంటూ వేధించేవారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ప్రామిసరీ నోట్లతో ఇప్పుడు తమను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు. కాగా, ఈ వ్యవహారంపై మంత్రి అనిత ఇప్పటికే ఏలూరు ఎస్‌పీతో మాట్లాడినట్లు తెలుస్తోంది