వరద బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వరద బాధితులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందని.. ముఖ్యంగా సర్వే వివరాలు పొంతన లేనివిధంగా ఉన్నాయని మండిపడ్డారు. 97 శాతం మందికి నగదు బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.
ఎన్యుమరేషన్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలతో సహా అధికారులకు సమర్పించినా ఫలితం లేదన్నారు. టీడీపీ నేతలు సచివాలయాలలో కూర్చొని అర్హులను ఎంపిక చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22,185 మందికి నేటికీ కనీస సాయం అందలేదని చెప్పారు. పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అధికారులలో చిత్తశుద్ధి, పర్యవేక్షణ లోపించటంతో నెల రోజులు గడిచినా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వరద హెచ్చరికలు జారీచేయటంతో పాటు బాధితులకు సాయం అందించటంలోనూ ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. కేంద్రానికి రూ. 7 వేల కోట్ల నివేదిక పంపి.. చివరకు అరకొర సాయంగా రూ. 600 కోట్లు విదిల్చారని మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు.