హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పైకి ఏకంగా 200లకుపైగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి ఎవరూ అనవసరంగా ఇరాన్‌కు వెళ్లొద్దని హెచ్చరించింది. పరిస్థితులు చక్కబడే వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారతీయ పౌరులను సూచించింది.అక్కడి భద్రతా పరిస్థితులను పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఏదైనా అత్యవసరమైతే టెహ్రాన్‌లోని భారత ఎంబసీని సంప్రదించాలని తెలిపింది.