శ్రీకాకుళం జిల్లా, అరసవిల్లిలో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని రెండవ రోజు బుధవారం ఉదయం స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందింది. రెండు నిమిషాలు పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి. ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీలు, ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో మూల విరాట్‌ను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. ప్రత్యక్షదైవం.. ఆరోగ్యప్రదాత.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉదయభానుని లేలేత కిరణాలు తాకాయి.
ఈ అపురూప ఘట్టం మొదటి రోజు మంగళవారం ఉదయం ఆవిష్కృతమైంది. ఉదయం 6.05 నిమిషాలకు సూర్యకిరణాలు గోపురాన్ని దాటుకుంటూ అనివెట్టి మండపం, ధ్వజస్తంబం మీదుగా, ఆలయ పంచద్వారాలను దాటుకుంటూ, గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌ను తాకాయి. ఈ కమనీయ దృశ్యాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి.. పులకించారు. ఓం నమో సూర్యదేవాయ అనే నామస్మరణ మార్మోగింది. రెండేళ్లుగా వాతావరణంలో మబ్బుల కారణంగా ఆదిత్యుడికి కిరణాలు స్పశించేవి కాదు. దీంతో భక్తులు నిరాశ చెందేవారు. ఈ సారి మాత్రం కిరణాలు తాకడంతో స్వామి స్వర్ణ కాంతులతో దర్శనమిచ్చారని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ ఏటా మార్చి నెల 9, 10 తేదీల్లో, అక్టోబరు 1, 2 తేదీల్లో స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకుతాయని తెలిపారు. ఈసారి కిరణస్పర్శతో అత్యంత ప్రకాశవంతంగా స్వామి దర్శనమిచ్చారన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.