తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీనిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశమంతా కలకలం రేపిన లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మూడురోజులుగా తిరుపతి, తిరుమలల్లో త్రిపాఠి బృందం పర్యటిస్తూ, వివిధ కోణాల్లో దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళుతోంది.
ఈ క్రమంలో అనూహ్యంగా సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఇదే అంశంపై డీజీపీ తిరుమలలోని గోకులం గెస్ట్‌హౌ్‌సలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కల్తీ నెయ్యి వాడి లడ్డూను అపవిత్రం చేసినట్టు టీటీడీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసు తీవ్రతను బట్టి ఐజీ స్థాయి అధికారితో సిట్‌ను ఏర్పాటు చేశాం. టీటీడీ కొనుగోళ్ల విభాగంలో ప్రక్రియ ఎంటీ, శాంపిల్స్ ఎలా తీసుకుంటారు, ఎక్కడ తప్పు జరిగే అవకాశముంది వంటి సమాచారాన్ని సిట్ సేకరిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో దీనిపై వాదనలు జరుగుతున్నందున, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (గురువారం వరకు) దర్యాప్తును ఆపాలని కోరాం.’’ అని తెలిపారు. కోర్టు పరిధిలో ఈ అంశం ఉన్న క్రమంలో ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదన్నారు. టీటీడీ అంతర్గత విచారణ చేపట్టిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారనీ, దాని ఆధారంగానే కేసు నమోదు చేసి సిట్‌ను ఏర్పాటు చేసినట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే తిరిగి సిట్ విచారణ కొనసాగుతుందన్నారు. చట్టాలకు, న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగానే పోలీసు శాఖ పనిచేస్తుందని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామన్నారు. ఎవరినో తప్పుబట్టాలనో, లేదా ఇరికించాలనో తమకు ఉండదన్నారు. కోర్టు తీర్పులపై చర్చ చేయకూడదని తెలిపారు. ‘‘ఏ స్థాయి కోర్టు అయినప్పటికీ తీర్పు మాకు శిరోధార్యం’ అని స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ తిరుమలరావు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సరిపడా బందోబస్తును ఏర్పాటు చేశామని, నిరంతరం నిఘా ఉంచి ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.