ప్రపంచానికే దిశ నిర్దేశించే సామర్థ్యం విజయవాడకు ఉందని ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రపంచానికి చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం బెంజ్‌సర్కిల్ వద్ద పింక్ టాయిలెట్స్‌పై కలెక్టర్ సృజన, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నగరపాలక కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ సంకల్పంతో ప్రతిగ్రామంలో, మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజల భాగస్వామ్యంతోనే కార్యక్రమం సంపూర్ణమవుతుందన్నారు. విజయవాడ చైతన్యవంతమైన నగరం అని, ప్రపంచానికే దిశ నిర్దేశించే సామర్థ్యం వుందని దీనిలో భాగంగా పింక్ టాయిలెట్స్ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో మరిన్ని పింక్ టాయిలెట్స్ రావాలని ఆశిస్తున్నారని తెలిపారు.