గూడూరులో ఆంజనేయస్వామి జెండా ఉత్సవాలు బుధవారం రాత్రి శోభాయమానంగా జరిగాయి. ఎటుచూసినా జనసంద్రంగా మారింది. బజారువీధిలోని కలిశంకొట్టు వద్ద ఆంజనేయస్వామి జెండాకు తొలుత పూజలు నిర్వహించారు. ఈ జెండాను పట్టణ పొలిమేర్లలో తిప్పి కలిశం కొట్టు వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు జరిపారు. దీంతో జెండా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జెండాలకు పూజలు చేశారు.
రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లపై జెండాలను ఉంచి ఊరేగించారు. ఈ ఊరేగింపు ముందు బ్యాండు మేళాలు, తప్పెట్లు, జింగిరి మేళం, కోలాటాలు, బాణసంచా పేలుళ్లు, యువత చిందులతో సందడి చేశారు. బుట్టబొమ్మల వేషధారణలు అలరించాయి. ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ పలు వీధులలోని జెండా ఉత్సవాలకు హజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ జెండా ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, ఇతర చోట్ల ఉద్యోగాలు చేసే స్థానికులు, పరిసర గ్రామాల వారు తరలిరావడంతో పట్టణం సందడిగా మారింది. ప్రధానంగా గమళ్లపాళెం, తూర్పువీధి, కరణాలవీధి, మిట్టపాళెం, కోనేటిమిట్ట, కుమ్మరివీధి, అళఘనాథస్వామి దేవస్థానం, సత్రపువీధి, నలజాలమ్మవీధి, వీరారెడ్డిపల్లి, తిలక్‌నగర్‌సెంటర్, ఇందిరానగర్, అశోక్‌నగర్ , నరసింగరావుపేట, అడివయ్య కాలనీ, సిరామిక్ సెంటర్, మాళవ్యానగర్, ఐసీఎస్ రోడ్డు, శివాలయం సెంటర్, అరుంధతీయనగర్ తదితర ప్రాంతాలలో జెండా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. డీఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.