విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అరసవల్లి స్థానిక ఏడురోడ్ల జంక్షన్ వద్ద బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.చందు, బి.హరీష్ మాట్లాడుతూ.. 32 మంది ప్రాణ బలిదానాలతో, వామపక్ష ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటయ్యిందన్నారు.
ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని, ప్రైవేటీకరణతో యువత జీవితాలు రోడ్డున పడతాయన్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అలాగే తిరుపతి లడ్డూ వ్యవహారంతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. మద్దతుగా జేవీవీ రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, నల్లి ధర్మారావు సంఘీభావం తెలిపారు. దీక్షలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ రాజు, సహాయ కార్యదర్శి ఎం.సంతోష్, కన్వీనర్ పవిత్ర తదితరులు పాల్గొన్నారు.