శ్రీకాకుళం జిల్లాలో హోటల్, కల్యాణ మండపాల వ్యాపారులపై వరసదాడులు జరుగుతున్నాయని, రౌడీల నుంచి తాగుబోతుల నుంచి రక్షణ కల్పించాలని అ సోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మెట్ట నాగరాజు కోరారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ను పలు హోటల్స్, కల్యాణ మండపాల నిర్వాహకులతో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలం గా వరుసగా తమ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయని,
మంగళవారం సాయంత్రం స్థానిక 80 అడుగుల రోడ్డులో గల ఓ కల్యాణ మండపం మేనేజర్ ధనుం జయ్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మూడు రోజుల కిందట రామలక్ష్మణ కూడలిలో ఉన్న ఓ హోటల్‌లో మద్యం తాగిన ఓ వ్యక్తి సిబ్బందిపై దు ర్భాషలాడి ఫర్నీచర్ ధ్వంసం చేశాడని, దీనిపై కూడా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. దాడులకు పాల్పడు తున్న వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో వివిధ హోటల్స్, కల్యాణ మండపాల నిర్వాహకులు నక్క రామరాజు, గోపి, సుదర్శన్, సతీష్, రాజా, మాధవి, అంధవరపు తిరుమల, టంకాల కృష్ణ తదితరులు ఉన్నారు.