శ్రీకాకుళం జిల్లా జీవనాడి వంశధార ప్రాజెక్టు రెండో దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తిచేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం వంశధార కార్యాలయంలో వంశధార ప్రాజెక్టు రూపశిల్పి సీఆర్‌ఎం పట్నాయక్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. అతి త్వరలో వంశధార ఎడమ ప్రధాన కాలువను ఆధునికీకరిస్తామని చెప్పారు.
‘త్వరలోనే నాగావళి, వంశధార నదుల అనుసంధానాన్ని పూర్తిచేస్తాం. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నిధులైనా, కేంద్రం నుంచి నిధులైనా తీసుకుని వస్తాం. నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో ఉన్న అడ్డంకులను తొలగిస్తాం. అవసరమైతే ఒడిశా సీఎంతో మన ముఖ్యమంత్రి చర్చిస్తారు. రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేకుండా నేరడి బ్యారేజీని పూర్తిచేస్తాం. సీఆర్‌ఎం పట్నాయక్ వంటి మహోన్నత వ్యక్తులను భగవంతుడు జన్మించకుంటే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు అనేది ఉండేది కాదు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా నీటికొరత ఉంటుంది. మన రాష్ట్రంలో రాయలసీమ వంటి ప్రాంతాల్లో కొరత ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ బ్రహ్మాండమైన జీవనదులు వంశధార, నాగావళి ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా జిల్లా వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. సమర్థవంతమైన నీటిపారుదలతోనే అభివృద్ధి సాధ్యం. సీఆర్‌ఎం పట్నాయక్ లాంటి ఆణిముత్యాలు జిల్లాలో చాలామంది ఉన్నారు. అది మనందరి అదృష్టం.’ అని తెలిపారు.