ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయం... తహసీల్దార్ కార్యాలయం... కలెక్టరేట్ చుట్టూ మండుటెండలో కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చివరికి గురువారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారు. గేటు బయటే బాధితుల నుంచి సిబ్బంది, పోలీసులు అర్జీలు స్వీకరించారు.
వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచ్చిన బాధితులు విధిలేక మురుగు కాలువల పక్కన, ఫుట్‌పాత్‌లపైన కూర్చుని నరకయాతన అనుభవించారు. పనులు మానుకుని పరిహారం కోసం తిరుగుతున్నాం.. దయచేసి మా గోడు వినండి.. అంటూ బాధితులు వాపోతున్నారు. గత ఐదేళ్లు కాలు కదపకుండానే వలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ... కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు.