త్వరలో జరుగబోయే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ సత్తా చాటుదామని వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే రాష్ట్రంలోనే ప్రజలందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వ్యతిరేకత వెలువెత్తుతుందన్నారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మేలు పొందిన రాష్ట్ర ప్రజలు ఎవరు వైయస్ జగన్‌ను మర్చిపోలేదన్నారు. మోసపూరిత హామీలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. మళ్లీ వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2025 మార్చి నెలలో జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు.