గురువారం రాత్రి తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే కూడలిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..... ‘‘ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే వారు ఆగిపోతారు. అదే గోవిందా అంటే మనం ఆగిపోం. మనం హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వడం లేదు. నేను జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చాను. ఉప ముఖ్యమంత్రిగానో లేక జనసేన పార్టీ అధ్యక్షుడిగానో కాదు... సగటు దేశ పౌరుడుగా జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను.
సగటు భారతీయుడిగా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. అదే సమయంలో ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, సిక్కు తదితర అన్యమతాలను గుండెల నిండా గౌరవిస్తాను. వసుధైక కుటుంబంగా అన్ని ప్రాణులు, జాతులు, ప్రాంతాలు సుఖంగా ఉండాలని కోరుకునే సనాతనధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరాముడు. అనేక పేర్లతో పిలుచుకునే ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే రాజకీయం, అపహాస్యం, అవహేళన చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటించడం పాపంగా మాట్లాడుతున్నారు’’ . ‘‘సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాజకీయ స్థాయిని, అధికారాన్ని, పదవులను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే.
21 ఏళ్ల వయసులో ఇదే తిరుపతిలో సనాతన ధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. ఇన్నేళ్లలో ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు. నమాజ్ వినిపించగానే గౌరవ సూచకంగా ప్రసంగాలను నిలిపివేశాను. నిన్న నా కుమార్తె రష్యన్ క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి నా చిత్తశుద్ధి చూపించాను. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఏ దారైతే ముందుకు తీసుకెళ్తుందో అదే నా దారి. ఏ దారైతే అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో అదే నా దారి. ఏ మార్గంలో మరణం కూడా మహా ప్రభంజనమవుతుందో అదే నా మార్గం.
సనాతన ధర్మాన్ని కొందరు వైరస్ అంటున్నారు. అందరం కొలిచే శ్రీరాముడిని పాదరక్షలతో కొడుతూ ఊరేగింపు తీశారు. శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యితో తయారుచేసిన ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా పంపారు. వాటినే అయోధ్య రాముడికి పంపారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకలను ‘నాచ్ గానా’ (తైతక్కలు) అంటూ అవహేళన చేశారు. మోదీని, నన్ను ద్వేషించండి. కానీ, రాముడ్ని ద్వేషించవద్దు. హిందువులుగా మేమెవరం నోరెత్తకూడదా? బాధపడకూడదా? ఏదైనా అంటే మాత్రం హిందూ మతతత్వవాదులైపోతాం. ఇదే విధంగా క్రైస్తవులను, ఇస్లామ్‌ను అనగలరా? అంత ధైర్యం ఉందా?’’ అని ప్రశ్నించారు.