తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న (గురువారం) అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. లలాట, బహు, సప్త పునీత ప్రదేశంలో భూమిపూజ జరిపారు. తొమ్మిది కుండల్లో శాలి, వ్రహి, యువ, ముద్గ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజావాపం కార్యక్రమంతో అంకురార్పణ సమాప్తమైంది. క్రమం తప్పకుండా నీరు పోస్తూ మొలకెత్తేలా అర్చకులు జాగ్రత్తగా చూసుకుంటారు.
ఇక, శుక్రవారం సాయంత్రం ధ్వజరోహణం జరగనుంది. ఈ క్రతువుతో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా దేవేరులతో కూడిన మలయప్పకు ఉదయం బంగారువాకిలిలో విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం యాగశాలలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలనంతరం ఉత్సవ వరులతో పాటు అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి, ధ్వజపటాన్ని మధ్యాహ్నం 3 గంటలకు నాలుగుమాడ వీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగించి ఆలయానికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్న ముహూర్తంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. దీంతో వేంకటేశ్వర స్వామివారి వాహనసేవల వైభవ సంబరం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే రాత్రి 9-11 గంటల నుంచి పెద్దశేషవాహనం మొదలుకుని 11వ తేదీ రాత్రి అశ్వవాహనం వరకు మాడవీధుల్లో వాహనసేవలు కనులపండువగా జరుగనున్నాయి. 12న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.